తద్దినాలు పెడుతున్నాం కదా… మహాలయ పక్షాలు పెట్టాలా?
మరణించిన తల్లి / తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను / తల్లి నానమ్మ బామ్మలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత/తల్లి నానమ్మ తాతమ్మ ) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలి తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ…పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే… సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.
No comments:
Post a Comment